Wednesday 25 November 2020

భోజనం

9thSponnsfootredSubramanyam valluri
ఇరవైఒకటవ శతాబ్దంలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వుండే వస్తువుల్లో భోజనాల బల్ల ఒకటి. ఇది లేకపోతే సైకిల్ ఉండి చక్రాలు లేవు అన్న చందంగా ఉంటుంది నేటి ఇల్లు.
గత నలబై ఐదు - ఏబై ఏళ్ళలో దేశంలో వచ్చిన ఫ్యాషన్ల ప్రభావం వల్లనో , మారిన జీవనశైలి వల్లనో ఈ వస్తువు మన ఇళ్లల్లో ప్రముఖంగా కనిపించడానికి కారణం అయ్యుండొచ్చు. (పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు) శారీరక శ్రమ లేకపోవడం, సుఖాలకు బాగా అలవాటు పడడం వల్ల కింద కూర్చుని తినే అలవాటు పోగొట్టుకున్నాం.
ఒకప్పుడు మా వయసు వారి చిన్నతనంలో అందరి ఇళ్లల్లో కింద కూర్చుని , కలిసి భోజనం చేయడం,పెరట్లో అరటిచెట్టు ఉన్నవాళ్లు అతిధులతో పాటు ఇంటిల్లపాదికి అరటిఆకు, పీట వేసి వడ్డించడం ఉండేది. తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుకొచ్చి నింపాదిగా, సంతృప్తిగా భోజనం అరగించేవారు.
అసలు విషయం కూర్చోవడంలోనే ఉంది. బాసింపట్టు వేసుకుని విస్తరి ముందు కూర్చుని భోజనం చేయడం ఆచారమే కాకుండా, శాస్త్రాన్ని పొందుపరిచారు మన పూర్వీకులు. రెండిటి సమ్మేళనం ఎంతో ఆరోగ్యదాయకం. నేటి పిల్లలకు ఎంతమందికి తెలుసు ఈ విషయం.
పురావస్తు ఆధారాల ప్రకారం, మన పూర్వీకులు ఎన్నో వస్తు సామగ్రి వడ్రంగులతో చేయించుకునేవారు. ఇల్లు కట్టేటప్పుడు దూలాలు, నగిషీలు చెక్కిన స్తంభాలు , కిటికీలు , సింహద్వారాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దేవారు. వాటితోపాటు ఇంట్లోకి అవసరమైన మంచాలు, కుర్చీలు, రాసుకునే బల్లలు, బోశానం పెట్టెలు, బీరువాలు, ఉయ్యాల బల్లలు , వంటింట్లో పాలు పెరుగు, వెన్న దాచుకోవడానికి ప్రత్యేక అలమార్లు ఇత్యాదివి చేయించుకున్నవారు భోజనాల బల్ల , కూర్చోవడానికి కుర్చీలు మాత్రం చేయించుకునేవారు కాదు.
కారణం మడి, శుచి,అంటు, శుభ్రత మాత్రమే కాకుండా కొన్ని సమిష్టి కుటుంబాల్లో జనాభా కూడా ఎక్కువుగా ఉండేది. ఒక చూరు కింద ఏబై అరవై మంది నివసించేవారు.
భోజనానికి మాత్రం విశాలమైన గది ఉండాల్సిందే, బాసింపట్టు వేసుకుని భోజనానికి ఉపక్రమించేవారు. దేశంలో ఏ మూల కెళ్లినా ఇదే సంప్రదాయం. కూర్చోవడం యోగ సూత్రాల మీద ఆధారపడి నిర్ధారించబడింది. ఇందుకు అందరూ సమానులే, వారి హోదా, కులం ఏవి అడ్డొచేవి కావు ఈ "సుఖాసన బైటాయింపుకు".
ఈ క్రింద కూర్చోవడం అనే అలవాటు వల్ల ప్రతి ఒక్కరిలో వినయాన్ని పెంపొందించేవి. అలాగే భూమాతకు దగ్గర ఉన్న భావం కలిగేది. ప్రతికూల లక్షణాలైనటువంటి అహం, క్రోధం, ఆశ లాంటివి అదుపులో ఉండేవి. సుఖాసనం ధ్యానంలో భాగం అవడం వల్ల ఏకాగ్రత, ప్రశాంత భావాలు పెరిగేవి. సుదీర్ఘకాలంలో ఇదే ఆసనం వల్ల ఎక్కువుసేపు పూజలో నిర్మలంగా కూర్చోవడానికి దాహోదపడేది.
ఇవే కాకుండా ఇతర శాస్త్రీయ కారణాలు ఉన్నాయి, సుఖసనంలో కూర్చోవడంతో ప్రతి ముద్దకు కొద్దిగా ముందుకు వంగాలిసి వచ్చేది, మళ్ళీ నిటారుగా అయ్యి స్థిమితంగా నవులుతూ ముద్ద మింగేవారు. ఈ ముందుకు వెనక్కు జరగడం వల్ల కడుపు కండరాల మీద ఒత్తిడి పడేది, ఆ ఒత్తిడి వల్ల కడుపులోని గ్రంధులు ఆరగడానికి అవసరమయ్యే రసాయనాలు విడుదల అయ్యేవి.దాంతో అరుగుదల సులువయ్యేది
అరగడానికి మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు ఉండేవి ,ఒత్తిడివల్ల కడుపు, తక్కువ ఆహారానికే నిండినట్టుగా అనిపిస్తుంది, ఒక రకంగా మితాహరం వల్ల భుక్తాయాసం వుండేది కాదు.
బరువు పెరిగే అవకాశాలు తక్కువ, బోజనంతరం వంగి పనులు చేసుకునే ఆస్కారం ఉండి రక్త ప్రసరణ బావుండేది, ఇంకో అతి ముఖ్య లాభం వెన్నుముక్కకు ఏరకమైన ఇబ్బంది లేకుండా నిటారుగా ఉండేది. ఈ పలు కారణాలవల్ల భారతీయులు కింద సుఖాసనం వేసుకుని భోజనం చేసేవారు శతాబ్దాలపాటు. సరిగ్గా చెప్పాలంటే ఇరవయ్యవ శతాబ్దం మూడొంతుల వరకు ప్రతి ఇంట్లో కిందే కూర్చుని భోజనాలు చేసేవారు.
ఇదంతా జీవితంలో యాంత్రీకరణ పెరిగి, ప్రపంచం ఒక పల్లెటూరు అయిపోవడంతో పెక్కుమార్పులు చోటు చేసుకున్నాయి , ఆధునీకరణలో భాగంగా భోజనాలకు బల్ల వచ్చి తిష్ట వేసింది ప్రతి గృహంలో. పెళ్లిళ్లలో అయితే ఎంత హోదా కలవారైనా చెప్పులు లేదా బూట్లు వేసుకుని పళ్ళెం చేత్తో పట్టుకుని ఓ పదిళ్ళు తిరిగినట్టు, పదుగురి ముందు పళ్ళెం చాచాల్సిందే. సహపంక్తి భోజనాలు మృగ్యం ఈ కాలంలో, ఒకవేళ వున్నా వడ్డించేవారు సిగ్గుపడడం చూసి తీరాల్సిందే. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం చందాన , అరవై డెబ్బై పదార్థాల్లో వడ్డీయింపుకు వచ్చేసరికి పదార్థాలు తగ్గినా వడ్డించేవారికి తక్కువుగా వడ్డించమని మొదటే ఆదేశాలు అతని యజమాని ఇస్తాడు(క్యాటరర్) ఇంకొంచం వడ్డించమంటే విననట్టు వెళ్ళిపోతారు.
మా ఇంటికి ఎవరైనా బంధువులు, స్నేహితులు వస్తే ఇప్పటికి నేల మీద సుఖాసనం వేసుకుని భోజనం చేస్తాం. అతికొద్దిమంది కూర్చోలేనివారికి కుర్చీ చిన్న బల్ల ఏర్పాటు. మేము అన్నీకింద పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాం.
సుబ్రహ్మణ్యం వల్లూరి.

No comments:

Post a Comment