Thursday, 19 November 2020

ఊరకుంద ఈరణ్ణ స్వామి...

 మహాత్ముల పరిచయం.383

ఊరకుంద ఈరణ్ణ స్వామి...
వీరు ప్రసిద్ధ శైవ యోగులు. 1610 వ సంవత్సరంలో కౌతాళం అనే గ్రామం లో జన్మించారు. అసలు పేరు హిరణ్యులు. ఈ వూరు కర్నూలు సమీపాన ఆదోనీకి దగ్గరలో వుంది. తమ పన్నెండవ ఏట అడవిలో ఆవులను మేపటానికి వెళ్లినప్పుడు ఒక సిద్ధుడు వీరి వద్దకు వచ్చి గురుబోధ చేశారు. దైవధ్యానంలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గడపమన్నారు. బాలుడైన స్వామి వారు ఆ అశ్వత్థ వృక్షం క్రింద సమాధి స్థితి లో కూర్చుని, నరసింహ స్వామి ని కీర్తిస్తూ గడిపాడు.లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పొందారు. ఊరకుంద ఈరణ్ణ స్వామి గా పిలువబడే హిరణ్యులు వీరభద్ర వంశంలో జన్మించిన సిద్ధపురుషులు, యోగి,అణిమాది అష్టసిద్ధులు పొంది విరాగిగా జీవించారు. స్వామి వారి ప్రతీకగా అశ్వత్థ వృక్షాన్ని కొలుస్తారు. వందల సంవత్సరాలు గడచినా చెక్కుచెదరకుండా వుంది. మానవత్వం, ప్రేమ వారి ముఖ్యమైన ఆశయాలు. తమ తపశ్శక్తితో రోగాలు తగ్గిస్తూ, ఆర్తులను ఆదుకుంటూ, ప్రబోధాలతో శాంతి, సంతోషాన్ని పంచుతూ హిందూ సమాజాన్ని ఏకం చేశారు. ముస్లింల ఆధిపత్యం ఎక్కువ గా వున్న ఆ రోజుల్లో వీరభద్ర ప్రతిపాదితమైన వీరశైవాన్ని పాటిస్తూ, వీరభద్రులను తయారుచేసి ముస్లిం సైన్యాన్ని ఎదుర్కొని సనాతన ధర్మాన్ని నిలిపారు. వారి ఆశ్రమంలో ముస్లింలు ప్రవేశించి ఆక్రమించిగా శాంతిని కాంక్షించే వీరు చేతికర్ర, కమండలం ధరించి అనుచరులతో ఊరకుంద వచ్చారు. స్వామి అక్కడే వుంటూ ధర్మ ప్రబోధాలు చేస్తూ ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించారు. సమాధిని నిర్మాణం చేయించుకుని 1686 వ సంవత్సరంలో జీవసమాధి అయినారు. హిరణ్యులు తపస్సు చేసిన అశ్వత్థ వృక్షం క్రిందనే ఈరన్న స్వామి సన్నిధి ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేస్తున్నారు. 1768లో దేవాలయాన్ని నిర్మించారు. ఒక్క హిందవులే కాక ముస్లింలు కూడా వీరిని కొలుస్తారు. స్వామి తపస్సు చేసిన అశ్వత్థ వృక్షం క్రింద లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం,ప్రక్కన ఋషి ఈరణ్ణ విగ్రహం వుంచి పూజిస్తారు. ఇప్పటికీ ఈ స్వామి అగ్ని రూపములో ఈ ప్రాంతంలో రాత్రి పూట సంచరిస్తూ వుంటారని,ఆకాశం లో ఒక దీపంలా కనిపిస్తారని, తెల్లని గడ్డంతో వుంటారని అంటారు. సోమ, గురు వారాలు వీరికి అత్యంత ప్రియమైనవి. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా,ఊరకుంద పొలిమేర లోని అశ్వత్థ వృక్షం నివాసంగా, ఊరకుంద శ్రీ ఈరణ్ణ లక్ష్మీనరసింహ స్వామిగా శ్రావణ మాసంలో స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న రాఘవేంద్ర స్వామి పల్లకి ఊరకుంద లో అనుకోకుండా ఆగిపోగా, అప్పుడు స్వామి తన దివ్య దృష్టి తో ఆలయ మహిమను గుర్తించి, నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. తన దివ్యశక్తి ప్రభావం చేత జాతిని ఉత్తేజం చేసిన, ఆ మహాయోగి నివసించిన స్థలమైన ఊరకుంద రావి చెట్టు నీడలోని ప్రతి అణువూ ఆ పరమ యోగి నివాసమే.
Image may contain: one or more people and people standing
You, Rajyalakshmi Srinivas Boddupalli and 10 others

No comments:

Post a Comment