Friday, 20 November 2020

శ్రీ కావ్యకంఠ గణపతి ముని -----చాగంటి వారు

 శ్రీ కావ్యకంఠ గణపతి ముని


-----చాగంటి వారు


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻



దక్షిణ దేశములో గొప్ప ఉపాసకులైన శ్రీ కావ్యకంఠ గణపతిముని ఉండేవారు.


 వారు భగవాన్ రమణుల అంతేవాసి.


 ఆయనా, వారి తమ్ముడు అరుణాచలము వెళ్ళారు. ఆ రోజు ఏకాదశి, రాత్రి అయింది. తమ్ముడు ఆకలి అని అంటుంటే గణపతి ముని వద్ద డబ్బులు లేక బ్రాహ్మణ వీధిలో ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి తమ్ముడు ఆకలికి ఏడుస్తున్నాడు అన్నము పెట్టమని అరుస్తున్నారు. 


అందరూ 'ఈరోజు ఏకాదశి, ఉపవాసము' అని చెప్పారు.


 ఆయన తమ్ముడి ఏడుపు చూడలేక భగవంతుని ప్రార్ధన చేస్తూ శ్లోకము చదువుతూ వెళ్ళిపోతున్నారు.


 ఒక అరుగు మీద పడుకున్న బ్రహ్మణుడు లేచి 'మీరు అన్నము కోసము తిరుగుతున్నారా!' అని అడిగాడు. అవును అని చెప్పారు ముని. 


'ఎంత అదృష్ఠము! నా భార్యకి ఒక వ్రతము ఉంది. వంట చేసి ఏకాదశి నాడు సాయంకాలము ఇద్దరు బ్రహ్మణులకి  భోజనము వడ్డిస్తుంది. ఇవ్వాళ ఎవరూ యాత్రికులు కూడా దొరక లేదు. అన్నీ వండుకుని ఇలా పడుకున్నాము. రండి' అని పిలిచి లోపలికి తీసుకుని వెళ్ళారు. 


గణపతిముని ఏకాదశినాడు భోజనము చేసేవారు కాదు. ఇద్దరు ఉంటే గానీ ఆవిడ వ్రతము సిధ్ధించదు అని ఆయనా మడి కట్టుకుని భోజనమునకు కూర్చున్నారు.


 ఆవిడ పార్వతీదేవి లాగా నడచి వచ్చి, కాశిలో వ్యాస భగవానునికి అన్నపూర్ణమ్మ అన్నము పెట్టినట్లుగా అన్నము పెట్టినది. ఇద్దరూ కడుపునిండా అన్నము తిన్నాకా ఆమె కొంత ద్రవ్యమును పెట్టి తాంబూలము ఇచ్చింది. 


అన్న, తమ్ముడు 'అమ్మా! భుక్తాయాసముగా ఉన్నది. ఎక్కడకు వెళ్ళలేము అరుగు మీద పడుకుంటాము' అంటే ఆమె పడుకోమన్నది. 


ఇద్దరూ బట్టల మూటలు తల కింద పెట్టుకుని నిద్రపోయి, తెల్లవారుఝామున లేచి నిన్న రాత్రి మనకు అన్నము పెట్టిన ఆమెకు నమస్కారము చేసుకుందామని చూస్తే ఆ ఇల్లు లేదు. 


వాళ్ళు పడుకున్న అరుగు, ఆమె ఇచ్చిన తాంబూలము, అందులో డబ్బు అలాగే ఉన్నది. 


ఇంటికి బదులుగా వినాయకుడి గుడి ఉంది. 


ఇది కావ్యకంఠముని జీవితములో యదార్ధముగా జరిగిన  సంఘటన. 


ఆయన ఆర్తి చూసి అమ్మవారే ఆయనకు అన్నం పెట్టింది.


కావ్యకంఠ గణపతి ముని గొప్ప ఉపాసకులు, గురుభక్తి తత్పరులు. 


ఒకప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఒక విచిత్రమైన నిర్ణయము తీసుకున్నారు. అరుణాచలములో రమణ మహర్షి దగ్గరకు వెళ్ళి తాను 21 రోజులు దీక్ష తీసుకుని ఉమా సహస్రమును రచన చేస్తానని చెప్పారు. అక్కడ మామిడి గుహలో కూర్చుని కావ్య రచన మొదలు పెట్టారు. 


కొద్ది రోజులు అయ్యేసరికి  బొటనవేలు మీద పెద్ద గోరుచుట్టు వేసింది. 


అమ్మవారి అనుగ్రహానికి ఆమె గురించి రచన చేద్దామన్నా ప్రారబ్ధము అడ్డు పడుతున్నది. లోపల మేధాశక్తి, సంస్కృత ప్రవాహము ఉన్నా నొప్పి వల్ల వ్రాయలేకపోతున్నారు. 19 రోజులు అయిపోయాయి. ఇంకా 250 శ్లోకములు వ్రాయాలి


. శిష్యులు 'మీ దీక్ష పాడైపోయిందా? ఉమాసహస్రము అవదా ? ఆ తల్లి అనుగ్రహము కలగలేదా?' అన్నారు. గ


ణపతి ముని – ‘నన్ను ఏ ప్రారబ్ధము వెంబడించి వేలిమీద గోరుచుట్టుగా నిలబడిందో అది తీసివేసి మిగిలిన శ్లోకములను ఆ తల్లియే పూర్తి చేయించాలి. అమ్మ అనుగ్రహము కలిగితే తప్పకుండా పూర్తి  చేయిస్తుంది’ అని ఆ రాత్రి పడుకున్నారు.


 తెల్లవారితే 20 వ రోజు. తిరువణ్ణామలై లో పుణ్యకోటి అనే వైద్యునకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కలలో కనిపించి 'ఎంతో వైద్యము తెలిసిన వాడివి, చేత కాని వాడిలా పడుకున్నావు. కొండ మీద గుహలో ఒక బ్రాహ్మణుడు ఉమాసహస్రము రచన చేస్తున్నాడు. అతని దీక్షాకాలము పూర్తి కావస్తున్నది. ఆయన వేలికి గోరుచుట్టు లేచింది. పరికరములు అన్నిటినీ పట్టుకెళ్ళి నీ శక్తి అంతటినీ ప్రదర్శించి గోరుచుట్టును తొలగించి కట్టు కట్టి ఉమాసహస్రము పూర్తి చేసే శక్తినివ్వు' అన్నారు.


 ఆయన రమణ మహర్షి దగ్గరకు వెళ్తే ఆ వైద్యుని ఆమ్రగుహలోకి తీసుకెళ్ళారు. ఆయనలోకి అమ్మవారు ప్రవేశించింది. రాత్రి ఎనిమిది అయింది. 


వైద్యుడు కట్టు కట్టినా గణపతిముని ఘంటమును పట్టకోలేక పోతున్నారు. తెల్లవారే లోపల 250 శ్లోకములు పూర్తి కావాలి. శిష్యులు 'కొద్ది సమయమే ఉన్నది. ఐదుగురు లేఖకులను తీసుకుని వస్తాము. వారు పుస్తకములు, కలము పట్టుకుని కూర్చుంటే మీరు శ్లోకములను చెపితే వారు వ్రాస్తారు. చెప్పేస్తారా ?' అని అడిగితే గణపతి ముని 'అలాగే తీసుకుని రండి' అన్నారు.


 గణపతి ముని  తన చేతిని ఒళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఆయన నాలుక మీద శారద నిలబడింది. ఆ సమయములో రమణ మహర్షి వచ్చి వెనక ఉన్న అరుగు ఎక్కి పడుకున్నారు. ఆయన ఎందుకు వచ్చారో తెలియదు.   


గణపతి ముని  తన చేతిని ఒళ్ళో పెట్టుకుని లేఖకుల వంక చూస్తూ ఐదు వృత్తములతో ఒక్కక్కరికీ ఒక్కక్క పాదము చొప్పున చెపుతూ మొత్తము శ్లోకములు చెప్పారు. 

అయిదుగురి లేఖకులకు రెండు గంటలలో 250  శ్లోకములు వెయ్యి పాదములతో పూర్తి చేసారు. 


బ్రాహ్మీముహూర్తము అవుతుండగా రమణ మహర్షి దిగ్గున లేచారు. ఆయనే ఆత్మయై, శారదయై కావ్యకంఠగణపతి మునిని ఆవహించి చెప్పించి పూర్తి చేయించింది. 


దీక్ష పూర్తి అవుతుండగా ఉమా సహస్రము పూర్తి అయింది. గణపతి ముని పొంగిపోతూ ఇది రమణులు నా చేత చెప్పించారని ఆఖరు శ్లోకముతో పూర్తి చేసారు.


ఓం నమో భగవతే శ్రీరమణాయ🙏



🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment