Thursday 19 November 2020

మహాత్ముల పరిచయం-382 భట్ జీ బాపూ మహరాజ్

 మహాత్ముల పరిచయం-382

భట్ జీ బాపూ మహరాజ్
1948 ప్రాంతంలో భాగ్యనగరంలో ఉర్దూ అధికారిక భాష అయినప్పటికీ,మరాఠీ కూడా ఎక్కువగా మాట్లాడే వారు. అదే సమయంలో ముగ్గురు మహానుభావులు శ్రీ కేశవస్వామి భాగేనగర్ (జియాగూడ), శ్రీ నారాయణ స్వామి మహరాజ్ (హష్సీనీ ఆలమ్),శ్రీ భట్ జీ బాపూ మహరాజ్ (ఉప్పు గూడ) భాగ్యనగరాన్ని పావనం చేశారు.
భట్ జీ బాపూ మహరాజ్ 1845న హైదరాబాద్ ఉప్పుగూడలో జన్మించారు. తండ్రి రామచంద్ర పంత్, తల్లి సీతామాయి. చిన్నతనంలోనే బాలం భట్ అనే సంస్కృత పండితుని దగ్గర వేదం, సంస్కృత భాషను అభ్యసించారు. హిందూస్థానీ సంగీతం, గ్వాలియర్ ఘరానా నేర్చుకున్నారు. టప్పా అనే గానంలో ప్రసిద్ధులు. వారి యొక్క అలౌకిక సంగీతం విన్నవాళ్ళకి బ్రహ్మానందం కలిగేది.ఈశ్వర సర్వ భూతానామ్ అనే శృతి వాక్యాన్ని పాటిస్తూ, పవిత్రమైన సాత్విక జీవితం గడిపారు. అన్నదానం భగవంతునికి ప్రీతి కలిగించే కార్యాలలో ఒకటని చెప్పేవారు. నాదబ్రహ్మోపాసన చేస్తూ, నామ సంకీర్తన చేసేవారు. ఏకాదశి వ్రతం చేసి, ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అన్నదానం చేసేవారు. ద్వాదశి ప్రసాదానికి వేలమంది హాజరవుతున్న ధనం గురించి కానీ, అన్నదానానికి కావలసిన సన్నాహాల గురించి కానీ ఆతురత పడేవారు కాదు. చేయించేది అంతా (కర్త) ఈశ్వరుడు అనేవారు. నామ సంకీర్తన, అన్నదాన వ్రతము జీవితాంతం ఆచరించారు. వీరి సంస్థానంలో ఇప్పటికీ ద్వాదశి వ్రతం తరువాత అన్నదానం చేస్తారు. ఎంతో శాంత స్వభావులయిన వీరు ఎవరినీ బాధపెట్టవద్దని, ఎవరిని బాధపెట్టినా భగవంతుని పెట్టినట్లేనని అనేవారు. 1932లో సమాధి చెందారు. ఉప్పు గూడ, హైదరాబాద్ లో వీరి సమాధి వున్న ప్రాంతంలో ఒక వేదపాఠశాల, గోశాల, అన్నదానానికి పెద్ద హాలు వున్నాయి. వీరి భక్తులు వీరు ఏర్పరిచిన సాంప్రదాయాన్ని ద్వాదశీ వ్రతం అన్నదానం, నామ సంకీర్తన, భాగవత సప్తాహం మొదలగు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పారమార్ధిక జీవితంతో పాటు, లౌకిక కార్యక్రమాలు కూడా ఏ వ్యామోహం లేకుండా నిర్వహించిన వీరు జీవితమంతా ధ్యానం, పూజ, భగవదుత్సవాలు, నాదోపాసనతో గడిపారు.
అడ్రస్:18-3-77
బోయిగూడా, కండికల్, హైదరాబాద్-53.

No comments:

Post a Comment