



"దత్త " ఈరెండు అక్షరాలు తారకం.
ఈ రెండు అక్షరాలు, ఒకటి కామధేనువు,
మరోకటి కల్పవృక్షము.
ఈ రెండు అక్షరాలు, అఖిలభువన భాండాలను
నడుపు చక్రాలు.
యోగుల పరమగమ్యం.
నా ప్రాణాలు.
సకల ప్రాణులను తరింపచేయు మంత్రమేదైనా ఉన్నదా స్వామి అని శుకమహర్షి, పరమేశ్వరుని అడిగినపుడు,
కైలాసపతి చెప్పిన మంత్రం "దత్త "
కార్తవీర్యుని కనికరించి విధి రాతని కూడా తిరగరాయగల విధాత దివ్యమంత్రం ఇదే అని నిరూపించింది "దత్త "
విష్ణుదత్తుని దీవించి లోకహితంకోసం అవతరించినపుడు, నీకేసంతానమై వస్తాను అని వరప్రదానం చేసినది "దత్త"
ప్రహ్లాదునికి, వశిష్ఠులవారికి, యదువునకు, మత్సేంద్రనాథునకు ఇలా ఎందరికో యోగసిధ్ధిని అనుగ్రహించినది "దత్త "
పరశురాములవారు సేవించినది,
నారదులవారిచే కీర్తింపబడినది,
బ్రహ్మకు వేదాలను బోధించినది."దత్త "
బ్రహ్మకు వేదాలను బోధించటమంటే,
అది పరబ్రహ్మకే సాధ్యం.
అందుకే అది "దత్త" పరబ్రహ్మం.
ఇలా ఎంతని చెబుతాము..
పిపీలికాది బ్రహ్మపర్యంతం ఎవరికి సాధ్యం
దత్తుని వర్ణించటం?
దత్తనామ మహిమని వివరించటం?
దత్త తత్వాన్ని బోధించటం?
మనకేమి తెలియకపోయినా,
ఒక్కటి చేయగలిగితే చాలు.
అదే దత్తుని పట్ల విశ్వాసంతో ఆయన నామాన్ని భజించటము, జపించటము, స్మరించటము.
ఇది చేయగలిగితే చాలు.
ఆయన అపారకరుణ మనకు కలుగుతుంది.
ఆయన దివ్య ప్రేమలో మనం తడిసిముద్ద అవుతాము.
ఎక్కడ దత్త దత్త దత్త అని స్మరించబడుతోందో,
ఎక్కడ దత్త నామసంకీర్తన జరుగుతోందో,
ఎక్కడ దత్త నామము భజింపబడుతోందో
అటువంటి ఇల్లు,సిధ్ధుల ఆశ్రమం.
అక్కడ సకల దేవీదేవతలు కొలువై ఉంటారు.
ఎవరి హృదయం గడియారంలోని సెకన్లు తెలిపే
ముల్లులా దత్త దత్త దత్త అని స్పందిస్తుందో,
అట్టి హృదయమే మాతాపురం.
ఎవరి మనసు "అనసూయ "
ఎవరి బుధ్ధి "అత్రి " అవుతుందో,
వారి హృదయంలోకి దత్తమై వచ్చేవాడే దత్తుడు.
దత్తుడు పరమపిత,
దత్తుడు లోకకర్త,
దత్తుడు జగద్భర్త,
దత్తుడు వేదములచే సేవించబడు పరబ్రహ్మం.
అలాటి దత్తునివైపు చూడటమే ఓ యోగం.
జయ గురుదేవ దత్త.
ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
No comments:
Post a Comment