Saturday 29 December 2018

చిత్తూరు నాగయ్య

'కళాదీపికాంజలి'!
◆◆◆◆◆◆◆◆◆
చిత్తూరు నాగయ్య
28-3-1904 30-12-1973
(ఈరోజు వారి వర్థంతి)
★★★★★★★★★★★
దక్షిణ భారత దేశ చలనచిత్ర రంగంలో అగ్రనటుడూ,
ఆంధ్రుల ఆదరాభిమానాలను చూరగొన్న
ఉత్తమ నటుడూ 'పద్మశ్రీ' చిత్తూరు ఉప్పలదడియం
నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యారు.
దక్షిణభారత దేశంలో 'పద్మశ్రీ' పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది - తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు.
ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం
అతిశయోక్తి అనిపించుకోదు.
బాల్యము:
★★★★★
చిత్తూరు నాగయ్య 1904, మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. తండ్రి ఉప్పల ధడియం రామలింగేశ్వర శర్మ గారు అక్కడ రెవిన్యు శాఖలో ఉద్యోగిగా వుండేవాడు. నాగయ్య అసలు పేరు "ఉప్పల దడియం నాగయ్య". కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యాడు. చిన్నప్పటినుండి భాగవత, భారతాల పట్ల అమితమైన ఆసక్తి నాగయ్యకు, తండ్రి చక్కని సంగీత విద్వాంసుడు, పండితుడు. తండ్రి సంగీత కళాభిజ్ఞత కొడుకుని బాల్యంలోనే ఆకర్షించింది.
సంగీతము పై అభిరుచి
★★★★★★★★★★
తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించాడు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచ్చేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా వుండేది బాల నాగయ్యకు. దూరంగా వున్న ఒక వూళ్ళో సంగీత కచ్చేరి జరుగనున్న విషయం విన్నాడు. ఇంట్లో మాట మాత్రం చెప్పక తన చెవి పోగుల్ని అమ్మి ఆ డబ్బుతో రైలు టిక్కెట్ కొని సంగీత కచ్చేరి విని ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు సంగీతాభిరుచిని గుర్తించిన తండ్రి, కుమారుణ్ణి సంగీత విద్యాభ్యాసం కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళె వద్దకు పంపాడు.
ఒకమారు మహా విద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళె గార్ల సంగీత కచ్చేరీకి నాగయ్య హాజరయ్యాడు. కచ్చేరి పూర్తి అయ్యింది. శ్రోతలందరు వెళ్ళి పోయారు. నాగయ్య మాత్రం అలాగే నిల్చుని పుష్పవనం అయ్యర్ వంక అదే పనిగా చూడసాగాడు. అయ్యర్, " ఏం అబ్బాయ్, ఏం కావాలి? నీ పేరేమి?" అని ప్రశ్నించాడు. నా పేరు 'ప్రహ్లాదుడు' అని జవాబిచ్చాడు బాలుడు. 'సరే కాని, నీకేమైనా సంగీతం వచ్చా' అని అడిగాడు. 'ఓ-వినండి' అంటూ భాగవతంలోని ప్రహ్లాదుని పద్యాలను మధురంగా భావయుక్తంగా పాడాడు. గోవింద స్వామి పిళ్ళె ఆనందంగా వయోలిన్ వాయించాడు. రెండు గంటలసేపు పద్యాలు పాడాడు. అయ్యర్ ఆనంద పరవశుడై 'బాబు, నీవు గొప్ప కళాకారుడవుతావు' అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను పలుమార్లు మిత్రులకు చెప్పేవాడు నాగయ్య.
కంచిలో నయన పిళ్ళే వద్ద, కుంభ కోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాధ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించాడు నాగయ్య. చిత్తూరులో మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో అతని చదువు కొంతవరకు సాగింది. మనసంతా సంగీతంపై వున్నపుడు కాలేజీలో చదవటం ఎలా సాగుతుంది? కాలేజీ చదువు అర్ధంతరంగా ముగిసింది. విద్యార్థిగా నాటకాల్లో వేషాలు వేసి ప్రశంసలందుకొన్నాడు. కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య. కాని జీవితంలో కష్టాలెదురైనాయి. తండ్రి మరణించాడు. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతిలేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. పుణ్యక్షేత్రాలు చూశాడు. 'నీ కార్యక్షేత్రం కళారంగం, వెళ్ళు మరళా కళాకారుడవై ఆత్మ శాంతిని సాధించు' అని అంతరాత్మ బోధించింది. మరలా చిత్తూరు చేరాడు. మద్రాసులో చదువుకు 'గుడ్ బై' చెప్పిన నాగయ్య చిత్తూరు జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తాగా చేరాడు. స్థానిక రామ విలాస సభ నాటక సంఘం వారితో పరిచయం లభించింది. చేత చిల్లిగవ్వలేక మద్రాసు వీధుల్లో తిరుగుతూ, ఆకలి బాధతో నుంగంబాకంలో క్రింద పడిపోయాడు. దారిన పోతున్న హచ్చిన్స్ కంపెనీ యజమాని, నాగయ్య పాత మిత్రుడు అయిన అచ్యుతనాయుడు నాగయ్యను గుర్తుపట్టి భోజన వసతులు కల్పించాడు.
నాయుడుగారి ప్రోత్సాహంతొ నాగయ్య ఎన్నో గ్రాంఫోను రికార్డులిచ్చాడు. "హిజ్ మాస్టర్స్ వాయిస్" కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకొన్నారు. నాగయ్య పాడిన రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయాయి.
1935 లో బి. ఎన్. రెడ్డి గారిని నాగయ్య కలుసుకొన్నాడు వెంటనే రెడ్డిగారు తమ మిత్రులైన హెచ్. ఎం. రెడ్డిగారికి నాగయ్య గారిని పరిచయం చేశారు. హెచ్. ఎం. రెడ్డి నాగయ్య కంఠ మాధుర్యానికి పరవశుడయ్యాడు. తాను తీసే "గృహలక్ష్మి" చిత్రంలో సంఘ సేవకుని పాత్ర యిచ్చాడు. ఆ వేషంలో నాగయ్య పాడిన, "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వనించింది. అప్పట్లో మద్యపాన నిషేధం అమలులో వుండేది కాన ఆ పాటకు జనాదరణ అమితంగా లభించింది.
నాటకాలు
★★★★★
చిత్తూరులో రామ విలాస సభ, లక్ష్మీ విలాస సభ, మద్రాసులో సుగుణ విలాస సభ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో, మొదట సావిత్రి, దమయంతి, చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంసలందు కొన్నాడు.
నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రా రెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించాడు. రామదాసులో కబీరు వేషధారిగా కహో రామ్‌ నామ్‌ అంటూ పాడుతూ రంగ ప్రవేశం చేయటంతోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మార్మోగింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పతకంతో పాటు 'రంగ భూషణ' బిరుదంతో సత్కరించారు.
కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య. కాని జీవితంలో కష్టాలెదురైనాయి. తండ్రి మరణించాడు. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతిలేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. పుణ్యక్షేత్రాలు చూశాడు. 'నీ కార్యక్షేత్రం కళారంగం, వెళ్ళు మరళా కళాకారుడవై ఆత్మ శాంతిని సాధించు' అని అంతరాత్మ బోధించింది. మరలా చిత్తూరు చేరాడు.
సినీరంగ ప్రవేశం
★★★★★★★
1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూర్లో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. 'పాటా పద్యం వచ్చునా - ఓకే!' అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉచ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొని ప్రాచుర్యం పొందాయి. తొలిచిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు.
1939లో బి.యన్.రెడ్డి వందేమాతరం చిత్రంలో నాగయ్యకు కథానాయకుని పాత్ర లభించింది. అదే చిత్రంలో నాగయ్య సంగీతాన్ని కూడా కూర్చారు. అప్పుడు 'హీరో ఇమేజ్' వుంటుందీ, పోతుందీ అన్న భావన లేనేలేదు. వెంటనే 'సుమంగళి (1940) లో వృద్ధపాత్ర ధరించారాయన. తర్వాతి చిత్రం దేవత (1941) లో హీరోయే. ఈ సినిమాలన్నీ తమిళనాడులో కూడా బాగా నడవడంతో, నాగయ్యకు తమిళ చిత్రాల్లో కుడా మంచి అవకాశాలొచ్చాయి. తమిళభాషను ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గ్రాంథికభాష కూడా అలవరుచున్నారు. తన పాటలు తానే పాడుతూ 'సిసలైన తెలుగు సినిమా హీరోగా' గొప్ప వెలుగు వెలిగారు నాగయ్య. స్వర్గసీమ (1945) ఒక ఉదాహరణ. భక్త పోతన (1942), త్యాగయ్య (1946), యోగి వేమన (1947) చిత్రాలు నాగయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ పాత్రల ప్రభావం ఆయన మీద బాగా పడింది.
1938-1973 మధ్య నాగయ్య 200పైగా తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. సుమంగళి, భక్త పోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య ఆయన నటించిన కొన్ని విశేష చిత్రాలు. అప్పటిలో నాగయ్య అత్యధిక పారితోషికం తీసుకొనే నటుడు. 1948లో తమిళ సినిమా "భక్యదలి (?)" కి నాగయ్యకు లక్ష రూపాయలు పారితోషికం.
నాగయ్య మంచి గాయకుడు, సంగీత దర్శకుడు కూడాను. స్వర్గసీమ సినిమాకు నేపధ్యగాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు. త్యాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజా నాగయ్యను 101 బంగారు నాణేలు, ఒక కంఠాభరణంతో సత్కరించారు. తెలుగు సినీరంగంలో మొట్టమొదటి పద్మశ్రీ సత్కారం గ్రహించింది నాగయ్యే. మాన్యులు, సామాన్యులు కూడా నాగయ్యను విపరీతంగా అభిమానించే వారు.
సినీనిర్మాత
★★★★★
తరువాత భాగ్యలక్ష్మి సినిమాతో చిత్రనిర్మాణంలోకి దిగారు. రామదాసు సినిమాలో ఆయన బాగా నష్టపోయారు. సినిమా నిర్మాణంలోను, దాన ధర్మాల వలన ఆయన ఆస్తి బాగా కరిగిపోయింది.
వ్యక్తిత్వం
★★★★
ఆయన మాటతీరూ, చిరునవ్వూ అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. పోతన - తన దగ్గర లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు, - నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. 'త్యాగయ్య తీస్తున్నప్పుడు వారి రేణుకా ఆఫీసు ధర్మసత్రంలా వుండేదని చెప్పుకుంటారు.
దర్శకత్వం
★★★★★
దర్శకుడుగా త్యాగయ్య ఆయన తొలిచిత్రం. త్యాగయ్య సినిమాను ఆయనే నిర్మించి, దర్శకత్వము చేశారు. నాయిల్లు (1953), భక్త రామదాసు (1964) చిత్రాలూ డైరెక్టు చేశారు - నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ. కొంతకాలం క్రితం మద్రాసులో నాగయ్య స్మారకదినోత్సవం జరిగితే, 'త్యాగయ్య' ప్రదర్శించారు. ఆ చిత్రం చూసిన ప్రసిద్ధదర్శకుడు కె.విశ్వనాథ్ 'ఈ చిత్రంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగానూ, ఉన్నతంగానూ ఉన్నాయి. ఆయన తీసిన కొన్ని షాట్స్ నాలాంటి దర్శకుల ఊహకు అందనివీ అని కీర్తించారు. 'త్యాగయ్య సినిమాలోని 'ఎందరో మహానుభావులూ' పాట విన్న ప్రసిద్ధ గాయకుడు జేసుదాసు త్యాగరాజు ఎలా పాడివుంటారో, నాగయ్యపాట విన్నాక, ఊహించుకోవచ్చును.
సన్మానాలు
★★★★★
నాగయ్యకు జరిగిన సన్మానాలు మరే నటుడికి జరగలేదు. 1965 లో భారత ప్రభుత్వం అతనికి 'పద్మశ్రీ' నిచ్చి గౌరవించింది. దక్షిణ భారత సినిమారంగంలో 'పద్మశ్రీ' అందుకొన్న మొదటి నటుడు నాగయ్య. "ఫిల్మ్‌ ఇండియా" సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని వేనోళ్ళ కొనియాడుతూ, నాగయ్యను 'ఆంధ్రా పాల్‌ముని' గా కీర్తించాడు. నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో నాగయ్య 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోను, 160 తమిళ చిత్రాల్లోను నటించాడు.
చివరి దశ
★★★★★
చివరి రోజులలో పేదరికాన్ని అనుభవించారు. కేవలం వందల రూపాయలకు చిన్న చిన్న వేషాలు వేశారు. తెలుగు సినీరంగములో ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య, ఆ తరువాత దశలో ఉదరపోషణకు చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలూ అందుకున్నారు. నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చెయ్యకండి. అపాత్రదానాలు చెయ్యకండి. ఎందరో గోముఖవ్యాఘ్రాలు వుంటారు. అందర్నీ నమ్మకండి! అని చెప్పేవారు
నాగయ్య చివరిదశలో మూత్రసంబంధమైన వ్యాధికి గురై అడయార్ లోని వి.హెచ్.ఎస్. సెంటర్ లో చేర్చబడ్డాడు. మృత్యుదేవతతో పోరాడుతున్న నాగయ్య వద్దకు అతని మిత్రులు ముదిగొండ లింగమూర్తి, ఇంటూరి వెంకటేశ్వరరావు అతని శయ్యవద్ద నిల్చి "రఘుపతి రాజారాం" గీతం పాడుతుండగా వింటూ అపర పోతన నాగయ్య 1973 డిసెంబర్ 30వ తేదీన కన్నుమూశాడు.
- పి.లక్ష్మీ నరసింహారావు
సికింద్రాబాదు

No comments:

Post a Comment