Thursday 29 August 2019

స్టార్ సెలెబ్రిటీ డా. సి. మృణాళిని.

స్టార్ సెలెబ్రిటీ డా. సి. మృణాళిని.
సాధారణంగా సినిమా రంగానికి చెందిన వారు సెలెబ్రిటీలుగా పరిగణించబడతారు. ఎవరైనా సెలెబ్రిటీలకే సెలబ్రిటీ అయితే వారు ‘స్టార్’ హోదా పొందినట్టు. అందుకే వారు ‘తార’లు. ఏ రంగానికి చెందినవారైనా, తారలందరూ సెలెబ్రిటీలే గానీ, సెలెబ్రిటీలందరూ తారలు కానక్కరలేదు.
సినిమా కాకుండా ఇతర రంగాల్లో సుప్రసిద్ధులైన వారిలో కూడా ‘తార’ స్థాయిని అందుకున్నవారు ఉంటారు. ఈ కోవకి చెందిన ఒక స్టార్ సెలెబ్రిటీ డాక్టర్ సి. మృణాళిని గారు. ఒక్క సాహిత్యమే కాదు, సంగీతం, లలిత కళలూ, సినిమా, పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు, విద్యా బోధన, భాష, సాంస్కృతిక వ్యవహారాలు - ఇలా ఏ రంగంలో, ఏ విభాగంలో చూసినా ఏదో ఒక స్థాయిలో ఆమె ప్రవేశం, ఉనికి, పాత్ర, కృషి మనకు కనిపిపిస్తాయి వీటికి తోడు విరబూసే చిరునవ్వు, వ్యక్తిత్వంలో వికసించే ఆత్మీయతా, పలకరింపులో పరిమళించే సంస్కార సౌరభాలు; చూడగానే "ఎవరు ఈ సరస్వతి!" అని చేతులెత్తి నమస్కరించాలని ఎంతటి అపరిచితులకైనా, అనిపిస్తుందంటే అందులో ఆశ్చర్యం ఏముంది! అందుకే ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలెందరో ఆమెకు అభిమానులు.
అటువంటి వారిని అలంకరించటానికి కాకపోతే సన్మానాలకు, సత్యారాలకు, బిరుదులకూ సార్ధకత ఏముంటుంది? అందుకే అవన్నీ వెదుక్కుంటూ వచ్చి కుప్పలు తెప్పలుగా ఎప్పుడో తన దరి చేరాయి. ఇప్పుడు మరొక పురస్కారం ఆమెను వరించింది. ప్రజ్వలిత అనే సాంస్కృతిక సంస్థ నిన్న (18 ఆగస్టు 2019) తెనాలిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ కె. శివారెడ్డిగారి చేతుల మీదుగా ‘ప్రతిభామూర్తి’ అనే ఈ పురస్కార ప్రదానం జరిగింది.
మనలో చాలామందికి, ఏదో రంగానికి చెందిన సుప్రసిద్ధులతో ఏ కొద్దిపాటి పరిచయం ఉన్నా దానిని అపురూపంగా భావించడం సహజం. మృణాళిని గారిని అభినందించడం అంటే ‘దాసుభాషితం’ తనను తాను అభినందించుకోవటం. ఎందుకంటే ‘దాసుభాషితం’ కు మృణాళిని గారికీ అభిమానానికి మించి, పరస్పర అభినందనలకు అతీతమైన ఆత్మీయమైన సంబంధం ఉంది. ఆమె ‘దాసుభాషితం’ కు ‘మెంటర్’. దాసుభాషితం ప్రతీ కార్యక్రమం వెనుక ఆమె అనుభవం, స్ఫూర్తి, కృషి ఉన్నాయి.
ప్రతిభావంతమైన ఆమె మార్గదర్శకత్వంలో తెలుగు భాషాభిమానులకు మరిన్ని మనోరంజకమైన కార్యక్రమాలు లభించాలని కోరుకుంటూ తన తరఫునా శ్రోతలందరి తరఫునా వారికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నది దాసుభాషితం.
~ Credits to Sri Tulasidas Konduru / Dasubhashitam ~

No comments:

Post a Comment