Wednesday 21 August 2019

మృణాళిని ఓ సర్వనామము

మృణాళిని ఓ సర్వనామము
-------------------------------------
గొప్పదైతే కావచ్చుకానీ పేరు మరీ ఇంత గొట్టుదైతే ఎలాగండీ బాబూ..
మ..దానికో రూత్వం
అష్టవంకరలు తిరిగే ణ...దానికో దీర్ఘం
మెలికెలు మెలికెలుగా కులికే ళ..దానికో గుడి
చివర్లో మాత్రం బుద్దిగా తలొంచుకుని కూచున్నట్టుండే.. ని
గమ్మత్తేమిటంటే
ఈ మూడు గొట్టక్షరాలకూ చివరి ని యే ప్రాణం
ఎవరినైనా చనువుగా నీ అనగలిగే పెద్దమనిషితనమూ
ఎవరితోనైనా నీ అని ఆత్మీయంగా పిలిపించుకోగల పెద్దమనసుతనమూ ఆమె..
ఆ పేరు
మృణాళిని ....ఆ పేరుకు లెక్కలేనంత పేరు
ఆ పేరొక బహువచనం ఆ పేరొక బహుముఖ నిర్వచనం
అందుకు..అందుకే ఈ పురస్కారం
ఇంతకీ ఆ పేరు ఏమేం సాధించిందో తెలుసా
జర్నలిజానికి రాతలు నేర్పింది, దృశ్యమాధ్యమానికి సౌందర్యాన్నద్దింది. రేడియోకు మాటలు దిద్దింది.
అధ్యాపకురాలిగా కొత్త పాఠమయింది. గైడ్ గా దారులు చూపింది. రచయిత్రిగా అన్ని ప్రక్రియలకూ కర్త కర్మయింది.
అందుకే ఆ పేరుకు కీర్తి ప్రతిష్టలు పర్యాయపదాలయాయి.
అది పేరు మాత్రమే కాదు సర్వనామము.
అందుకు ..అందుకే పురస్కారం.
ఇరవైకి పైగా పుస్తకాలు, పదికి పైగా దేశాలలో సిద్దాంత పత్రాల సమర్పణ, మూలాలను సరళం చేసిన అనువాదాలు
రెండు డజన్ల అవార్డులు ఈ పేరు మోసిన కిరీటాలు
అందుకే ఈ పురస్కారం.
కోమలి గాంధారం, ఇంతిహాసం,తాంబూలం, స్వరార్చనం, మాల్డుడి రచనలు, ఇంకా మరెన్నో సృజనలు ఆ పేరు సాహిత్యానికిచ్చిన బహుమానాలు.
ఇవన్నీ ఒకెత్తయితే రేడియో రూపకాలలో వరల్డ్ స్పేస్ లో చందమామ కథల ప్రొడక్షన్ కు వచ్చిన మూడు అవార్డులు మరెంతో ఎత్తు.
ఆ ఎత్తులకెదిగినందుకే ఈ అవార్డు.
ఆ పేరంటే తామర తూడు అని నిఘంటువు చెప్పే అర్దమంతా అబద్దం
అసలు నిజమేంటంటే
నెర్రెలిచ్చిన పూల వనాలకు వరాలిచ్చే నవ్వు,
ప్రసరించిన మేర వెన్నెల ప్రవహించే చూపు ,
తిరగాడిన చోట కుప్పలు తెప్పలుగా పరుచుకునే ఆత్మీయ పరిమళం
మనసునే మాటలు చేసే తేనె పాటల తీపిరాగాల పలకరింత
కళ్లెదుట కదలాడే నిలువెత్తు విద్యుల్లత విద్వల్లత, మానవ రూప దేవత
ఇది నిజం..ఇదే నిజం..
ఇవే ఆ పేరుకు అసలు అర్దాలు
అందుకే ఈ పురస్కారం
అవును ఆ పేరులో అక్షరాలన్నీ గొట్టువే కావచ్చు..
కానీ అర్దం మాత్రం సున్నితం, నవనీతం
అక్షరాలన్నీ మెలికలే కావచ్చు అర్దం మాత్రం
గురితప్పని బాణం..ఎప్పటికీ గెలిచే రణం
మృణాళినిగారూ
ఈ నూలుపోగుకో చంద్రిక మీరు..
అందుకోండి మా ఈ ప్రజ్వలిత పురస్కారం
..
ఇవాళ మృణాళిని మేడమ్ ప్రజ్వలిత పురస్కారం అందుకుంటున్న సందర్బంగా అందించిన సన్మాన పత్రం ఇది...
నేను రాసింది

No comments:

Post a Comment