Saturday 14 September 2019

"భారతీయుల కళాప్రాభవమ్మొలికించి"

Ramesh Panchakarla

"భారతీయుల కళాప్రాభవమ్మొలికించి" పద్యాన్ని రచించినవారు తోలేటి వెంకటరెడ్ది గారు( వెంకటశాస్త్రి).విజయనగరం సంగీత కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ఘంటసాలకు తోలేటి పరిచయమయ్యారు.తాను పాటలు,పద్యాలు రాస్తానని వాటిని పాడి రికార్డ్ చేయించమని ఘంటసాలగారితో చెబుతూ ఉండేవారు. 1949లో సరోజినినాయుడు గారు మరణించిన సందర్భంగా తోలేటి రాసిన ఈ పద్యాన్ని ఘంటసాల స్వరపరచి పాడగా 1950లో రికార్డ్ గా ఇది విడుదల అయింది. పద్యవివరణ డా.ఎం.పురుషోత్తమాచార్య విరచిత "మన ఘంటసాల పద్యగాన సౌరభం" నుండి గ్రహింపబడినది.
తోలేటి వెంకటరెడ్డి గారు 1947లో మద్రాసుకు వచ్చి స్థిరపడ్డారు. 1952లో ఏ.వి.యం సంస్థలో రచయితగా చేరి "జీవితం,సంఘం, వదిన,ఆడజన్మ" మొదలైన సినిమాలకు పనిచేసి మంచిపేరు సంపాదించారు."ఆలీబాబా 40 దొంగలు" సినిమాకు పనిచేస్తూ అకాలమృత్యువు పాలైనారు.
సరోజినీదేవికి "భారతకోకిల" అనే బిరుదున్న విషయాన్ని మొదటిపాదం లోనే ద్వనింపజేసారు. వంగదేశంలో జన్మించి తెలుగుజాతి నట్టింట కోడలిగా అడుగుపెట్టిన విషయాన్ని 2,3 పాదాలలో అందంగా సూచించారు. ప్రాక్పశ్చిమ రీతులను ముడిపెట్టే సందేశాలను పాఠాలవలే అందించింది కనుక పంతులమ్మతో పోల్చారు.
ఘంటసాల మాస్టారు ఈ పద్యాన్ని "మోహన" రాగంలో విశుద్ధమైన పోకడలతో బాణీ సమకూర్చి మధ్యమస్థాయిలో ఆలపించారు. అందువల్ల ఈ పద్య గానానికి "పహాడి" రాగ ముద్ర కూడా కొంత సంక్రమించినట్లు లీలగా తెలుస్తుంది.ఎందుకంటే సాధారణ గాంధారం, కైశిక నిషాదం తగలకున్నా మంద్ర పంచమ సంచారం కనిపిస్తున్నది కనుక.
మొదటిసారి పాడిన "కోయిలమ్మ" దగ్గర హార్మోనియం బిట్టు అందంగా వినిపిస్తుంది. "కోడలమ్మ" దగ్గర క్లారియోనెట్ స్వర సంచారం ఉదాత్తంగా ఉంది. "చేయెత్తి చూపిన" పదాన్ని చెయ్యి పైకెత్తినట్లుగానే పంచమం దగ్గర దీర్ఘీకరించడం భావధ్వనిగా భావించవచ్చు.
తేటగీతి రెండవపాదం చివరి "విఖ్యాతిగన్న" దగ్గరనుంచి ఆధార షడ్జమంతో ప్రారంభించి ఆరోహణ క్రమంలో ఆలపిస్తూ "ఘనతకెక్కుడి" దగ్గర పైస్థాయి గాంధారం దాకా వెళ్లి "వనితలార" దగ్గరికి తిరిగి ఆధార షడ్జమం దాకా రావడం ఒక మనోహరమైన స్వరతంత్రం, సంగీత మాయాజాలం.అది ఒక్క ఘంటసాలకే సాధ్యం.ముగింపు ఆలాపనను సకలస్వర యుక్తంగా చేసి మంద్ర పంచమం దగ్గర ఆగి మరో చిన్న స్వర సంపుటితో పద్యాని ముగించడం వల్ల "పహాడి" లక్షణంతో ఎంతో హాయి గొల్పుతుంది.
భారతీయుల కళాప్రాభవమ్మొలికించి
తీయగా పాడిన కోయిలమ్మ
భారతీయుల కళాప్రాభవమ్మొలికించి
తీయగా పాడిన కోయిలమ్మ
కమనీయ వంగ వంగడమెల్ల మూర్తిలో
ప్రసరించినట్టి మేల్ పసిడిబొమ్మా
కమనీయ వంగ వంగడమెల్ల మూర్తిలో
ప్రసరించినట్టి మేల్ పసిడిబొమ్మా
స్వారాజ్య వీర విహార రంగములోన
కోరి దూకిన తెన్గు కోడలమ్మ
మానవ కళ్యాణ మంగళారతిజ్యోతి
చేయెత్తి చూపిన చెల్లెలమ్మ..ఆ..ఆఆ
ప్రాక్పశ్చిమాలు విస్ఫారించి ప్రేమింప
పాఠాలు నేర్పిన పంతులమ్మ
భరతనారీ ప్రతాప ప్రభావ గరిమ
ఖండ ఖండాలు జల్లి విఖ్యాతిగన్న
దివ్యమూర్తి సరోజినిదేవి వోలె
దీర్ఘసూత్రాన ఆదేవి దివ్య సుగుణ
పుష్పముల నేరి విరిదండ పూర్తిచేసి
పుణ్య భారతమాతను పూజచేసి
ఘనతకెక్కుడి భారత వనితలార..ఆ.ఆఆ

No comments:

Post a Comment