Wednesday, 9 January 2019

స్వస్వరూపాణ్వేషన IV

స్వస్వరూపాణ్వేషన IV
* విచక్షణా జ్ఞానంతో గూడిన
నరజన్మ మెత్తియు గానుగెద్దులా
బ్రతుకెంత కాలమీడ్చెడుదువోయి
తెలుసుకో నీవెవరో రమణమార్గాన
* చేసుకున్న వారికి చేసుకున్నంత
దృష్టాదృష్ట ఫలసమన్వితం జీవితం
జ్ఞానార్థివై ఛేదించు పునరపి జననం
పునరపి మరణాల దీర్ఘ చక్రభ్రమణం
* బొమ్మలోన బొమ్మ పంచకోశాల బొమ్మ
మూడు శరీరాల బొమ్మ మనిషి బొమ్మ
సంచితపు సొమ్ము తో నెంత నూరేగినా
ప్రారబ్దకర్మ మున్నంత కాలమే ధరణిపైన
* గుడ్డెద్దు చేనులో పడినట్లు ఎంతకాలమైన
జీవించనేమి తెలుసుకో ఉపనిషత్ బోదతో
జరామరణాలు దేహధర్మాలు ఆకలిదప్పులు
శోకమోహాలు మనోప్రాణ సూక్ష్మదేహధర్మాలు
* అన్నమయ కోశము స్థూల శరీరంబవగ
ప్రొణమయ మనోమయ విజ్ఞానమయ
కోశంబులాయె (లింగ) సూక్ష్మ శరీరం
ఆనందమయ కోశమేమో కారణ శరీరంబు.
* ఆత్మప్రకాశాన్ని కప్పిపెట్టునవి పంచకోశాలు
అన్నమయ కోశం అత్యంత స్థూలం మిగతా
నాలుగు కోశాలచే వ్యాపింపబడి ఉండును
చివరి కోశం ఆనందమయ కోశం బ్రహ్మమయం
* పంచకోశాలు అస్మద్ (నేను) యుష్మద్ (నీవు)
వ్యష్టిగాను సమిష్టిగాను రెండు రకాలుగానుండు
వ్యష్టిగా జీవుడి పంచకోశాలు కార్యాలు వానిని
కారణాలయిన సమిష్టి కోశాలలో లీనం చేయాలి
* పంచకోశాలే మరొక రీతిగా దేహత్రయాలు
వ్యష్టిగా సమిష్టిగా దేహాలు గూడ రెండురకాలు
స్థూలదేహాల సమిష్టి విరాట్ సూక్ష్మదేహాల సమిష్టి
సూత్రాత్మ కాగా కారణదేహాల సమిష్టి ఈశ్వరుడు.
~ Kranthi Kumar Sammohi ~

No comments:

Post a Comment