Sunday, 18 February 2018

మరేమవుతాయ్?



మరేమవుతాయ్?
జీవితం దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే
అర్ధం చేసుకోవడమెలాగో అర్ధంకాక
శబ్దాలన్నీ నిశ్శబ్దం లోకి జారుకోక మరేమవుతాయ్?
మనసుకైన గాయాల్ని ముక్కుతో పొడిచి
నొసటితో నవ్వి ,కంటితో గేలిచేసే కాకుల్లాంటి
లోకులున్నపుడు మాటలన్నీ శబ్దాల్ని మర్చిపోక
మరేమవుతాయ్?
కళ్ళెదుట జరిగే అన్యాయాల్ని భరించి
అవమానాలని తట్టుకుని,ఆవేశాలని సహించి
సాగిపోతుంటే భావాలన్నీ మౌనముద్రలుగాక
మరేమవుతాయ్?
ఇన్నేళ్ళలో ఏం సాధించామని వెనక్కితిరిగి చూస్తే
గుప్పెడుదిగుళ్ళు,గంపెడునిరాశ,అణువణువునా
వెక్కిరిస్తుంటే పదాలన్నీ మౌనపు మూటలవక
మరేమవుతాయ్?
విధి అదేపనిగా పదేపదే పరిహసిస్తుంటే
తలరాత గుండె గూటిపై కథాకళి చేస్తుంటే
మాటలన్నీ మౌన సమాధులు గాక
మరేమవుతాయ్?
©® P.నాగసుశీల

No comments:

Post a Comment