Wednesday 28 February 2018

కార్తవీర్యార్జునునికి గర్గమహాముని చెప్పిన కథ: - దత్తాత్రేయ వైభవం

కార్తవీర్యార్జునునికి గర్గమహాముని చెప్పిన కథ: - దత్తాత్రేయ వైభవం
ఒకప్పుడు జంభాసురుడు అనే ఒక రాక్షసుడు విజ్రుమ్భించి తపోబలంతో తనదైన రాక్షస బలంతో దేవతలనందరినీ ఓడించివేశాడు. ఇతనివల్ల దేవతలందరూ దెబ్బతిని చెల్లాచెదురై బాధపడి తిరిగి తమ స్థితి కోసమని గురువైన బృహస్పతిని శరణువేడారు. బృహస్పతి ఒక్కసారి ధ్యాన ముద్రాంకితుడై బ్రహ్మదేవుని ఆజ్ఞతో జంభాసురుని అణచాలంటే విష్ణువునే ఆశ్రయించాలి అని తెలుసుకుని విష్ణువు దత్తుడిగా ఉన్న రూపాన్ని ఆశ్రయించమని దేవతలకు బోధించాడు. బృహస్పతితో కలిసి దేవతలందరూ దత్తుని వద్దకు వచ్చారు. ఆ సమయంలో దత్తుడు వారికి ఒళ్ళో మగువ, చేతిలో మదిరలతో దుర్భాషలాడుతూ కనిపించాడు. వికృతమైన చేష్టలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కానీ దేవతలకు ఏమిటి ఇలా కనపడుతున్నాడు అనే ప్రశ్న కూడా రాలేదు. సత్త్వగుణంతో కూడిన దైవీ శక్తికే భగవంతుడిని గుర్తించే శక్తి ఉంటుంది. స్వామీ! నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావు. కానీ నీ ఈ రూపం యొక్క తత్త్వం చెప్తున్నాం స్వామీ! ఏ దోషమూ లేనివాడివి నువ్వు అన్నారు. అప్పుడు స్వామి ఇన్ని దోషాలు పెట్టుకున్న నన్ను ఇలా సోత్రం చేస్తున్నారు. ఏ ప్రయోజనం కోసం వచ్చారో చెప్పండి అన్నాడు. అప్పుడు బృహస్పతి జంభాసుర సంహారం కోసం నిన్ను పిలుస్తున్నాం అన్నాడు. వ్యసనాలతో ఉన్న ఒకానొక పిచ్చివాడిని. నావల్ల అవుతుందా? అన్నారు స్వామి. స్వామీ! మీరు అలా మాట్లాడవద్దు. నువ్వు ఏమిటో మాకు తెలుసు. ఆ స్త్రీ ఏమిటో మాకు తెలుసు. నువ్వు ఎలా ప్రవర్తించినా నీ స్థితి బ్రాహ్మీ స్థితి. త్రిగుణాతీత స్థితి. ఆ స్థితి ఉన్నవాడికి ఏ దోషమూ లేదు. అగ్నికి చెదలు అంటుతాయా? దోషమునకు సంస్కృతంలో అఘము అంటారు. నీవు దోషము లేని వాడవు కనుక నీకు ‘అనఘుడు’ అని పేరు. అలాంటి నిన్ను ఆశ్రయించిన వారు అఘరహితులై అనఘులు అయిపోతున్నారు. నీ ఒళ్ళో ఉన్న ఈవిడ జగన్మాత. అంటే మహాలక్ష్మి. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో ‘అనఘా’ అనే నామం ఉంది. ఇక మద్యపానం – నువ్వు తాగుతున్న ఆ మద్యపానం మరేమిటో కాదు బ్రహ్మవిద్య. ఆ బ్రహ్మవిద్యా పానంతో నువ్వు ఆనంద పరవశుడవై ఉన్నావు అన్నారు. అప్పుడు తన అసలు స్వరూపాన్ని దర్శింపజేశాడు స్వామి అనఘాసమేతుడై. వెంటనే అందరూ సాష్టాంగ నమస్కారం చేసి దత్తుని ఉద్దేశించి అద్భుతమైన స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రంతో సంతుష్టి చెంది దత్తుల వారు “మీరు కోరినట్లు అసుర సంహారం చేస్తాను. మీరు వెళ్ళి ఆ రాక్షసులను యుద్ధానికి పిలిచినట్లు పిలిచి నా దగ్గరికి తీసుకురండి అన్నారు స్వామీ.
వెంటనే దేవతలందరూ వెళ్ళి జంభాసురుని కవ్వించారు. మళ్ళీ వచ్చారు అని అసురులందరూ యుద్ధం చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు చిత్రంగా యుద్ధం చేస్తూ వెనక్కి నడవడం మొదలుపెట్టారు. సరిగ్గా దత్తుని ఆశ్రమం వచ్చేసరికి వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఎదురుగా మునిలా కూర్చున్న దత్తులవారు, అనఘాదేవి కనిపించారు రాక్షసులకి. వెంటనే లక్ష్మి మీదకి దృష్టి వెళ్ళింది రాక్షసులకి. ముల్లోకాలలో ఇంత గొప్ప స్త్రీ మరొకరు లేరు. స్వీకరించవలసిందే అని ఒక సిబిక(పల్లకి) తెప్పించి ఆవిడని బలవంతంగా లాగి అందులో కూర్చోబెట్టి సిబిక నెత్తిమీద పెట్టుకున్నాడు. నవ్వుతూ ఉన్నారు దత్తుల వారు. సిరి నెత్తికి ఎక్కగానే ప్రతివాడిలో అంతవరకూ ఉన్న బలం, తేజస్సు, ఉత్సాహం క్షీణించిపోయాయి. దానితో బలహీనులైపోయారు. అప్పుడు లక్ష్మీదేవి దిగి వచ్చి దత్తుని ఒళ్ళో కూర్చుంది. వెంటనే దేవతలకు సైగ చేశారు దత్తులవారు ఇప్పుడు మీరు వెళ్ళండి అని. వెంటనే దేవతలందరూ వెళ్ళి అవలీలగా జంభాసురుడు మొదలుకొని రాక్షసులు అందరినీ సంహరించారు.
శత్రువును దెబ్బతీయాలంటే మన బలమైనా పెంచుకోవాలి లేదా వాడి బలమైనా తీసేయాలి. బలం తీయడానికి పెద్ద కారణమైనది సిరిని నెత్తికి ఎక్కించుకోవడం. ఎవడు సిరిని నెత్తికి ఎక్కించు కుంటాడో వాడిని లక్ష్మి వదిలేస్తుంది. ఇది ఈ కథలో ఉన్న తత్త్వం. సృష్టిలో ఉన్న ఐశ్వర్యములన్నీ నారాయణుడివి. ఆయన ఇక్కడ దత్తుడు. రాక్షసుల దృష్టి ఇక్కడ ఆయనదైన సంపద మీద పడింది కానీ సంపద ఎవరిదో ఆయనవైపు చూడలేదు.
దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏమిటంటే విశ్వవ్యాపకమైన సంపదలను, శక్తులని, ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము అని అవిభాజ్యంగా చూసి గ్రహించగలగాలి. దత్త తత్త్వం తెలిసిన వారికే ఆ తల్లి అనఘయై, దోషరహితయై అనుగ్రహిస్తున్నది. అలా లేనివారికి అఘం అవుతున్నది. అందుకే అందరికీ మహాలక్ష్మి, నీకు మాత్రం కాళరాత్రి అన్నాడు హనుమంతుడు రావణాసురుడితో.

No comments:

Post a Comment