Wednesday, 28 February 2018

◆◆◆◆◆ బిల్వము ◆◆◆◆◆

◆◆◆◆◆
బిల్వము
◆◆◆◆◆
ఏక బిల్వం శివార్పణమని ఒక భక్తుడైన
జ్ఞాని మారేడు దళము న‍ర్పించును.
జ్ఞానస్వరూప పరమాత్మయే శివుడు.
ఏ జ్ఞానము శివునితో బేధ బుద్ధి కలిగించునో ఆ జ్ఞానమనెడి అజ్ఞానమునే మారేడు దళముగా సమర్పించుచున్నారు.
మూడు దళములు చేరినదే
ఒక బిల్వము.
ఈ మూడు రేకులకు నాధారమైన కాండముఒక్కటే.
పూజకుడు,పూజ్యము,పూజ,
స్తోత్ర, స్తుత్యము,స్తుతి,
జ్ఞాత,జ్ఞేయము,జ్ఞానము
అను నీ మూడు మూడును వేరు వేరుగా భావించుటయే
త్రిపుటి జ్ఞానము.
ఇదియే అజ్ఞానము.
వేరు వేరుగా కానవచ్చినను ఆధారకాండ మొక్కటియే యైనట్లు
"ఓ!మహాదేవా!
నీ వొక్కడవే సృష్టి,స్థితి, లయాధికారిగ
మారేడు దళమందు మూడు పత్రములుగా వేరు వేరుగా తోచుచున్నట్లు తోచుచున్నావు.
పూజకుడవు నీవే,
పూజింపబడునది నీవే,
పూజ క్రియయు నీవే
అనుచు అభేద బుద్ధితో
పూజించుటయే పుణ్యము.
అట్లు పూజింపకుండుటయే పాపము.
అను నీ రహస్యము నెఱింగి బిల్వపత్ర రూపములతో త్రిపుటీ జ్ఞానమును
నీ పాదములకడ నేను విడుచుచున్నాననియెడి "శివోహమ్" "శివోహమ్" అను మహావాక్య జ్ఞానమును స్థిరపడుచేయునదియే
బిల్వపూజయగును.
◆◆◆◆◆
బిల్వ(మారేడు) వృక్షోత్పత్తి క్రమము
(బిల్వములో గల లక్ష్మీ ప్రసన్నత)
◆◆◆◆◆
శ్లో:త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం
చ త్రియాయుధమ్౹
త్రిజన్మ పాప సంహారం
ఏక బిల్వం సమార్పణమ్౹౹
ఒకానొకప్పుడు శ్రీవైకుంఠమున శ్రీలక్ష్మీ నారాయణు లేకాంతముగా నున్న సమయమున లక్ష్మీదేవి విష్ణుమూర్తితో
మీకు ప్రియులెవరని ప్రశ్నించెను.అందుల కాతడు "నాకు శివుడు ప్రియుడు నేను శివునకు ప్రియుడనని "బదులు చెప్పెను.అంతటితో నూరకుండక యాపె శివభక్తులలో శ్రేష్ఠు లెవరని ప్రశ్నింప నాతడు "ఎవరు శివుని పద్మములతో ఒక సంవత్సరకాలం పూజింతురో వారే శివభక్త శ్రేష్ఠులని నుడివెను"
వెంటనే ఆమె శివుని పూజించి శివభక్త శ్రేష్ఠురాలుగా పేరొంద నిశ్చయించి,
ఆ మరుసటి దినమునుండి ఉదయముననే నూట ఎనిమిది పద్మములు కోసికొనివచ్చి
తదేక ధ్యానముతో
అష్టోత్తర శత నామములతో
శివపూజ చేయుచుండెను.
ఇట్లు చేయుచుండ సంవత్సరములోని చివరి రోజున అష్టోత్తర పూజకు సరస్సులో రెండు పద్మములు తక్కువ బడెను. అందుకామె కొంత తడవు చింతించి తుదకు తన భర్త ఒకప్పుడు తన స్తనములు పద్మములు వంటివని తనకు చెప్పిన సంగతి స్మరణకు వచ్చి
ఇక భయములేదని ప్రప్రథమమున తన ఎడమవైపు స్తనమును గోసి శివుని కర్పించి,రెండవ స్తనము గోయ నుద్యుక్తురాలు కాగా శివుడు తనిసి,
ఆమె భక్తికి మెచ్చి ,ప్రత్యక్షమై ఆమె యర్పించిన స్తనమును మారేడు వృక్షముగా బుట్టునట్లు వరమిచ్చి ఆమెకు యధారూపము గల్పించి
ఆమెకీర్తిని శాశ్వత మొనర్చెను.
ఆ దినము నుండి బిల్వవృక్ష ముత్పన్నమై శివపూజకు బిల్వ దళము ప్రశస్తమైనదిగా వెలసినది.
శ్లో:వామ పత్రే వసేద్బ్రహ్మా
పద్మనాభశ్చ దక్షిణే౹
పత్రాగ్రే లోకపాలాశ్చ
మధ్య పత్రే సదాశివః౹౹
పృష్ఠభాగే స్థితా యక్షాః
పూర్వభాగేఽమృతం స్థితమ్౹
తస్మాద్వై పూర్వభాగేన
అర్చయే గిరిజాపతిమ్౹౹
తా౹౹శివపూజకు మూడు రేకులతో
(ఆకులు) నొప్పిన బిల్వదళమే ఉపయోగింపవలయును.బిల్వదళములోని మూడు రేకులలో
మధ్యగలది సదాశివుడనియు కుడివైపునది విష్ణువనియు నెడమవైపునది బ్రహ్మభాగమనియు ప్రసిద్ధినొందినది.పత్రాగ్రమున లోకపాలు రుందురు.మరియు బిల్వదళములోని
ముందుభాగమున నమృతమును వెనుక భాగమున యక్షులును కలుగుటచేత శివుని పూర్వభాగము
ముందువైచి శివుని పూజింపవలయును. ఇట్టి మహిమలు గలిగి లక్ష్మీ స్వరూపమైనదే బిల్వవృక్షము.బిల్వవనము
కాశీక్షేత్ర తుల్యము.ఎక్కడెక్కడ మాఱేడు చెట్టుగలదో అచ్చటచ్చట
ఆ చెట్టుక్రింద లింగాకారముతో శివుడు వెలసియుండునట.
ఇంటి ఆవరణలో
ఈశాన్యభాగమున బిల్వవృక్షమున్న
ఐశ్వర్యము కలుగును. ఆపదలుండవు.
తూర్పుననున్నసుఖప్రాప్తియగును.
పడమర నున్న పుత్ర సంతాన భాగ్యము కలుగును.
దక్షిణమున నున్నచో యమబాధలుండవు.
ఈ విషయములు
స్కాందపురాణములో నుడువబడినది.
ఎండిన పత్రమైనను, నిల్వయుండిన పత్రములైనను శివపూజకు దోషములేక
పనికివచ్చి పూజించువాని సర్వపాపములను పోగొట్టగల్గును.
శ్లో౹౹శుష్కైః పర్యుషితైర్వాపి
బిల్వపత్రైస్తుయో నరః౹
పూజయంస్తు మహాదేవం
ముచ్యతే సర్వపాతకైః౹౹
శ్లో౹౹బిల్వానాం దర్శనం పుణ్యం
స్పర్శనం పాప నాశనమ్౹
అఘోర పాపసంహారం
ఏక బిల్వం శివార్పణమ్౹౹
◆◆◆◆◆
మారేడు-ఒక దివ్య ఓషధి
◆◆◆◆◆
1.సదాఫలం:
ఎల్లప్పుడును ఫలములు
గలిగియుండునది.
2.మహాఫలః:
గొప్ప ఫలములు గలది.
3.త్రిపత్ర:
మూడు ఆకులు గలది.
4.గంధపత్రః:
వాసనగల ఆకులు గలది.
5.హృద్యగంధః:
మనోహరమగు సువాసన గలది.
6.కంటకాఢ్యః:
ముండ్లుగల వృక్షము
7.శ్రీఫలః:
శ్రీకారమువలె నుండు ఫలములు
గలది.
అని మారేడు చెట్టునకు నామాంతరములు గలవు.ఇది ఈశ్వర
ప్రీతికరమగు వృక్షము. పవిత్రమగు నీశ్వర పూజా పత్రములలో బిల్వపత్రము శ్రేష్ఠము.గాలిని, నీటిని శుభ్రపరచుటలో వీనికి మించినవి వృక్ష
పత్రములలో లేవు.దీని గాలి సోకినను, పీల్చబడినను శరీరమందలి బాహ్యాభ్యంతర పదార్థములు చెడకుండనుండును. గాలి సోకని గర్భాలయములలో(దేవాలయమున)
దుర్వాసన పుట్టకుండ పూజలో శివున కర్పింపబడిన మారేడు పత్రములు కాపాడుచుండును.దీనియందలి గుణవిశేషమును బట్టియే యిది పూజాద్రవ్యముగ నేర్పడినది.మారేడు
చెట్టునందలి సర్వాంగములు గూడ
నత్యంతోపయుక్తములైనవి.
ఔషధ ప్రక్రియలో దీని విలువ అనుపమానము.
మారేడు వేరు మూడు దోషములను
హరించును.వాంతులను కట్టును.సగము పండిన పండు దీపనకారి.వేడిచేయు స్వభావము కలది.వాత కఫముల హరించును. బాగుగా పండిన పండు విదాహి దోషములనడంచును.
అగ్నిని,పైత్యమును పోగొట్టును.ఆకులు కఫ వాతములను,
ఆమశూలలను హరించును.
గ్రాహి రుచిని బుట్టించును.పూవులు అతిసారమును దప్పిని వాంతిని హరించును. మారేడు పండు గుజ్జునుండి తీసిన తైలము వాత హరమైనది.
ధన్వంతరినిఘంటువులో,భావప్రకాశికలో,బృహన్నిఘంటురత్నాకరములో,
చరకసంహితలో,సుశ్రుతసంహితలో,
చక్రదత్త,వంగసేన,మళయాళ రహస్య యోగములలో దీని చికిత్సావిధానము వివరముగా తెలుపబడినది.
ఆమవాతమునకు,జ్వరములకు,
మూలవ్యాధులకు,ప్రవాహికకు,
స్కంధగ్రహనివారణమునకు,
చెముడుకు,అతిసారమునకు,
ఉబ్బులకు,రక్తమూలములకు,
వాంతులకు,గ్రహణులకు,
శరీరదుర్గంధముపోవుటకు,
ఆమశూలలకు,చంటిపిల్లలవాంతికి,
విరేచనములకు,నేత్రరోగములకు,
సమస్త విషములకు,మారేడుతో తయారుచేయబడిన వివిధౌషధములు పనిచేయును.ఆ యా వ్యాధులను బోగొట్టును.
బిల్వాది లేహ్యము చాల ప్రశస్తమైనది.అజీర్ణవాతములకిది వజ్రాయుధం వంటిది. మరియు దారుణమగు ఎక్కిళ్ళు,వాంతులు, ఊర్థ్వవాతములు, శ్వాసకాసలు,హృచ్ఛూలలు,అరుచ్యపస్మారములు తగ్గును.
నవీన వైద్యక మతము ప్రకారమిది చాలా విలువైనది.పండిన మారేడు రేచనకారి,మూలవ్యాధి రోగులకిది బాగుగా పనిచేయును.
ఆకుల రసము అగ్నిదగ్ధ వ్రణములకు హితకరమైనది.అతిసార అమరక్తాతి సారములయందు బాగుగ పనిచేయును. మరియు జ్వర కాసలయందు దీని వేరు బాగా పనిచేయును
-'విద్యావాచస్పతి'
వీరవల్లి రామానుజాచారి
(వీ.రా.ఆచార్య)

No comments:

Post a Comment